Friday, September 13, 2013

యేడ నుండి పుట్టితిమో యింతక తొల్లి యింక-

35.
యేడ నుండి పుట్టితిమో యింతక తొల్లి యింక
నేడకుఁబోయెదమో యిట మీఁదను

గత చన్న పితరు లక్కట నెవ్వరో
హితవై యిప్పటి పుత్రులిది యెవ్వరో

తొడికి స్వర్గాదులు తొల్లి యాడ వోయీ-
నడచే ప్రపంచము నా కేడదో.     4-393


తొడికిలు = ఒడిసి పట్టుకొను, లంకించుకొను

Thursday, September 12, 2013

ఇదియే వేదాంత మిందుకంటే లేదు


33.
ఇదియే వేదాంత మిందుకంటె లేదు
యిదియే శ్రీవేంకటేశుని మతము

విరతియే లాభము విరతియే సౌఖ్యము
విరతియే పో విజ్ఞానము
విరతిచే ఘనులైరి వినకవారెల్ల
విరతిఁ బొందకున్నవీడదు భవము   IIఇదియేII

చిత్తమే పాపము చిత్తమే పుణ్యము
చిత్తమే మోక్షసిద్ధియును
చిత్తమువలెనే శ్రీహరి నిలుచును
చిత్తశాంతి లేక చేరదు పరము           IIఇదియేII

యెంతచదివినా యెంతవెదకినా
యింతకంటె మరి యిఁక లేదు
యింతకంటె శ్రీవెంకటేశుదాసులౌట
యెంతవారికైన యిదియే తెరువు.    IIఇదియేII       4-369

విరతి = విరామము ,విశ్రాంతి
తెరువు = దారి, మార్గము

Sunday, September 8, 2013

దైవమే నేరుచుఁ గాక తగిలించ విడిపించ

32.
దైవమే నేరుచుఁ గాక తగిలించ విడిపించ
యీవల సంసారికి నేమి సేయవచ్చును

ఆస యెచ్చోట నుండు నక్కడ దైన్యము నుండు
వాసులన్నీ నెందు నుండు వన్నెలు నందుండు
వేసట యెక్కడ నుండు వీత రాగ మాడనుండు
యీసుల నీ లంకె వాప నెవ్వరికిఁ దరము IIదైవమేII

అతికోప మేడనుండు నజ్ఞాన మాడనుండు
మతిఁ బంత మెందుండు మత్సర మందుండు
మతకము లేడనుండు మాయలును నందు నుండు
యితరు లెవ్వరు నిందు కే మనగలరు IIదైవమేII

తన భక్తి యెందుండు తపమును నందుండు
మనసెందు నుండు దీమసమును నందుండు
తనివి యెక్కడనుండు తగు సుఖ మందుండు
తనర శ్రీ వేంకటేశు దైవికము లివియే.  IIదైవమేII  4-351

నీవే కాచుట గాక నేరుపు నా యందేది

నీవే కాచుట గాక నేరుపు నా యందేది
చేవల వేఁప మాను చేఁదు మానీనా. 4-345

నీవే తప్ప నితఃపరం బెఱుగ మన్నింపం దగున్ దీనునిన్   -- అంటూ వేడుకోవటమే మనం చేయాల్సిన పని-- అని బోధిస్తున్నారు మనకు అన్నమయ్య.

Sunday, July 18, 2010

ముఖరమై మాఁకులకు మొదలఁ బోసిన నీరు శిఖలకుఁ దనువెక్కి చిగిరించిన యట్టు

29.
ముఖరమై మాఁకులకు మొదలఁ బోసిన నీరు
శిఖలకుఁ దనువెక్కి చిగిరించిన యట్టు
వరుసల నిన్నిటా వన్నె బంగారమే
పరిపరి విధముల పలు సొమ్ములైనట్లు 4-340

30.
ఎంత వెఱ్ఱిఁ గొండదవ్వి యెలుకఁ బట్టెద నేను
పంతపు శ్రీహరి నా భ్రమ వాపవే
పడని పాట్లఁ బెక్కు పనులఁ దిరుగుటెల్ల
కుడిచే పట్టెఁడు గూటి కొర కింతే కా
కడ దాఁకాఁ జెలులతోఁ కాపురము సేయుటెల్ల
వొడలు మరచి యుండే వొక్క నిమిషానికా. 4-344

Monday, April 12, 2010

కోటి విద్యలునుఁ గూటి కొఱకె పో

28.
కోటి విద్యలునుఁ గూటి కొఱకె పో
చాటువ మెలఁగేటి శరీరికి
తేటల నాఁకలి దీరిన పిమ్మట
పాటుకుఁ బాటే బయలై పోవు

మెఱసేటి దెల్లా మెలుఁతల కొరకే
చెఱల దేహముల జీవునికి
అఱమరపుల సుఖమందిన పిమ్మట
మొఱఁగుకు మొఱఁగే మొయిలై పోవు

అన్ని చదువులును నాతని కొరకే
నన్నెరిఁగిన సుజ్ఞానికిని. 4- 339

Monday, March 15, 2010

శునకముబతుకును సుఖమయ్యే తోఁచుఁగాని

27.
శునకముబతుకును సుఖమయ్యే తోఁచుఁగాని
తనకది హీనమని తలఁచుకోదు
మనసొడఁబడితేను మంచిదేమి కానిదేమి
తనువులో నంతరాత్మ దైవమౌట దప్పదు.

పురువుకుండేనెలవు భువనేశ్వరమై తోఁచు
పెరచోటి గుంతయైన ప్రియమై యుండు
యిరవై వుండితేఁజాలు యెగువేమి దిగువేమి
వరుస లోకములు  " సర్వం విష్ణుమయ " ము     4-264

బ్లాగ్మిత్రులందరికీ నూతన తెలుగు సంవత్సర ( వికృతి నామ ) శుభాకాంక్షలు

Saturday, March 6, 2010

పెంచగ పెంచగఁ బెరిగీ నాసలు తుంచఁగఁదుంచఁగ దొలఁగునవి

25.
నీట ముంచు పాలముంచు నీ చిత్తమికను.   4-224
ఓ  స్వామీ ! నీట ముంచినా పాలముంచినా నీదేనయ్యా భారము. సర్వస్య శరణాగతి.
26.
పెంచగ పెంచగఁ బెరిగీ నాసలు
తుంచఁగఁ దుంచఁగ దొలఁగునవి
కంచము కూడును కట్టిన కోకయు
వంచన మేనికి వలసిన దింతే
గుడిశ లోన నొక కుక్కిమంచమున
వొడలు సగము ననువుండెడి దింతే. 4-242

మనం పెంచుకొనే కొలదీ ఆశలు పెఱిగిపోతుంటాయి. మనం వాటిని తుంచుకోవటం చేతనే వాటిని అదుపులో ఉంచుకోగలుగుతాం. తుంచగా తుంచగా అవి తొలగుతవి,  కాని ఒకేమాఱు అన్ని ఆశలూ పోవు.
మన శరీర పోషణకి కావలసినవి - కుడవటానికి పట్టెడు మెతుకులూ, కట్టడానికింత గుడ్డానూ. ఉండటానికో గుడిశ, పరుండటానికో కుక్కిమంచమూ కూడా వుంటే  ఇంక కావలసినదేముంది ?

Thursday, January 21, 2010

విత్తొకటి వెట్టఁ గాను వేరొకటి మొలచీనా

24.
విత్తొకటి వెట్టఁగాను వేరొకటి మొలచీనా
హత్తి దేహగుణములు ఆతుమ కయ్యీనా
చెంది చేదుతిన్న నోరు చేఁదే యయివుండుఁ గాక
దిందు పడి కొంతైనాఁ దియ్యనుండీనా
యెంగిలి బుట్టిన మేను హేయమే వెదకుఁ గాక
చెంగలించి పావనము సేసుకొనీనా
చేతికి వచ్చిన సొమ్ము చేరి దాఁచు కొనుఁ గాక
యేతులఁ దా నొల్లనంటా యీసడించీనా
4-186

దిందు పడి
యేతుల
పై పదాల కర్థాలు తెలియలేదు.

Monday, December 21, 2009

మనసులోని హరి మరవక తలచిన

23.
మనసులోని హరి మరవక తలచిన
యెనయ నిహపరము లే మరుదు
పెనగొన నాతనిపేరు నుడిగినను
తనకు మహానందము లే మరుదు


పుట్టించినాతని పొసగఁగ గొలిచిన 
యిట్టె వివేకం బే మరుదు
చుట్టి యతని దాసులకు మొక్కినను
పుట్టును గెలుచుట భువి నే మరుదు . 4-174