Saturday, May 31, 2008

కిందు పడి మఱికాని గెలుపెఱఁగ రాదు

మాళవిశ్రీ
౧.కిందు పడి మఱికాని గెలుపెఱఁగ రాదు
కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు
యెండ దాఁకక నీడ హిత వెఱఁగ రాదు
తినక చేఁదునుఁ దీపు తెలియనే రాదు 1-11


యుధ్ధంలో ఎప్పుడో ఓసారయినా క్రిందపడి ఓటమికి గురి కాకుండా గెలవడం ఎలాగో తెలియదు.
దుష్టుడైన వానితో పరిచయం కలిగి ఆ దుష్టగుణము తెలియకుండా గుణవంతుడైనవానిని అతని సుగుణాలను కానలేము.
ఎండలో తిరిగి వేడిమినీ అనుభవిస్తేనే కాని చెట్టు నీడలోని హాయిని తెలియలేము.
చేదు రుచి చూసిన తర్వాతే తీపులోని తియ్యందనము అనుభవం లో కొచ్చేది.

వరాళి

౨.అడవిఁ బడినవాఁడు వెడలఁ జోటు లేక
తొడరి కంపల కిందు దూరినట్లు
తెవులు వడిన వాఁడు తినఁబోయి మధురము
చవి గాక పులుసులు చవిగోరినట్లు
తనవారి విడిచి యితరమైనవారి
వెనకఁ దిరిగి తా వెఱ్ఱైనట్లు 1-15


అడవిలో దారి తప్పినవాడు తిరిగి బయటికి వెళ్ళే మార్గం తెలియలేక ఆప్రయత్నంలో ముళ్ళ కంపలలో చిక్కు కున్నట్లు.
రోగిష్టి తియ్యనిదేమైనా తిందామనే కోరికతో నోటిలో ఉంచుకొని కూడా, అది నోటికి హితవు కాక పుల్లనివి రుచిగా తిందామని అనుకున్నట్లు.
తన వాళ్లను వదలి కానివారి చుట్టూ తిరిగి చివరికి వెఱ్ఱి వాడై మిగిలినట్లు.

No comments: