Thursday, February 26, 2009

భవరోగ వైద్యుడవు పాటించ నీవొకఁడవే

సాళంగనాట
భవరోగ వైద్యుడవు పాటించ నీవొకఁడవే
నవనీతచోర నీకు నమో నమో. IIపల్లవిII

అతివలనెడి సర్పా లధరాలు గఱచిన
తతి మదనవిషాలు తలకెక్కెను
మితిలేనిరతులఁ దిమ్మరివట్టె దేహాలు
మతిమఱచె నిందుకు మందేదొకో. IIభవII

పొలఁతులనెడిమహాభూతాలు సోఁకిన
తలమొలలు విడి బిత్తలై యున్నారు
అలరుచెనకులచే నంగములు జీరలాయ
మలసి యిందుకు నిఁక మంత్రమేదొకో. IIభవII

తరుణులకాఁగిలనే తాపజ్వరాలు వట్టి
కరఁగి మేనెల్ల దిగఁగారఁజొచ్చెను
నిరతి శ్రీవేంకటేశ నీవే లోకులకు దిక్కు
అరుదుసుఖాననుండే యంత్రమేదొకో.౩-౩౫౬

No comments: