Tuesday, December 9, 2008

ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా

దేసాక్షి
ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా
వింతలైన నీమూర్తి వెసఁ దెలిసేమా. IIపల్లవిII

లోకములో సముద్రము లోతు చెప్పగ రాదట
ఆకాశ మింతింతని యనరాదట
మేకొని భూరేణువులు మితివెట్టఁగ రాదట
శ్రీకాంతుఁడ నీ మహిమ చెప్పి చూప వశమా. IIఎంతII

అల గాలిదెచ్చి ముడియఁగాఁ గట్ట రాదట
వెలయఁ గాలము గంటువేయరాదట
కలయ నలుదిక్కుల కడగానఁగ రాదట
జలజాక్ష నీరూపు తలపోయగలనా. IIఎంతII

కేవలమైన నీమాయ గెలువనే రాదట
భావించి మనసుఁ జక్కఁ బట్ట రాదట
దేవ యలమేల్మంగ పతివి నీశరణే గతి
శ్రీవేంకటేశ నిన్నుఁ జేరికొట్ట వశమా. IIఎంతII ౨-౨౬౨

No comments: