Thursday, April 16, 2009

విత్తొకటి వెట్టితేను వేరొకటి మొలచునా

౫౯.
విత్తొకటి వెట్టితేను వేరొకటి మొలచునా. ౩-౪౭౮

౬౦.
ఈతని నెఱఁగ కుంటే నిల స్వామి ద్రోహము
ఘాతల నేఱు గుడిచి కాలువ పొగడుట.౩-౫౩౬
౬౧.
పక్కన లోహముఁ బరుసము దాఁకిన
యెక్కువ నంతా హేమమే కాదా
మేదినీశుఁ డేమెలుఁతఁ బెండ్లాడిన
సాదించ నేలికసానే కాదా.౩-౫౩౯
౬౨.
కనురెప్ప మూసితేనే కడదాఁగె జగమెల్ల
కనుదెరచినంతనే కలిగెఁ దాను
కడుపు నిండినంతనే కైపాయ రుచులెల్లా
బెడిదపు టాఁకలైతేఁ బ్రియ మాయను.౩-౫౪౧

ఏ విత్తనం నాటితే ఆ మొక్కే మొలుస్తుంది కాని వేరొకటి మొలవదు కదా.
శ్రీవేంకటేశుని నెరుగకుంటే అది స్వామి ద్రోహమే అవుతుంది. నది ప్రక్కన జీవనం సాగిస్తూ నదినే పొగడాలి కాని ఓ చిన్న కాలువను పొగిడితే ఎలా.
పరుసము తాకితే ఇనుము బంగారమౌతుందంటారు. రాజుగారు ఏ స్త్రీని పెళ్ళి చేసుకుంటే ఆమే నౌకర్లను సాదించటానికి రాణీగారవుతుంది కదా.
కనురెప్ప మూసితే అంతటా చీకటే. ఈ జగత్తంతా తనకు కనపడదు. కాని కన్నులు తెరిస్తే మళ్ళీ ఈ జగమంతా కనిపిస్తుందికదా. కడుపు నిండినవాడికి రుచులెల్లా కైపెక్కినట్లే ఉంటాయి. కాని కరకర ఆకలేసే వాడికి అన్నీ రుచికరంగానే అనిపిస్తాయి.

No comments: